బిజెపి ఎంపీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: బంజారా భారత్ తెలంగాణ చైర్మన్ డాక్టర్ జగన్ నాయక్ తీవ్ర డిమాండ్
🗞️ బిబి న్యూస్ | 19 Apr 2026
తెలంగాణ, ఏప్రిల్ 19: పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవహేళించిన కర్ణాటక బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, బంజారా భారత్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జగన్ నాయక్ విస్లావత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి, వెంటనే వాపు తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని గట్టి డిమాండ్ చేశారు.విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ఉద్యమం దశాబ్దాల ప్రజా పోరాటం, విద్యార్థి ఉద్యమాలు, ఉద్యోగుల సమ్మెలు, రైతుల నిరసనలు, వేలాది యువత ఆత్మహుతుల త్యాగాల సమాహారమని గుర్తుచేశారు. దాన్ని దేశ విభజనతో పోల్చడం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని, చరిత్ర వక్రీకరణ అని మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా ఎంపీలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.
తెలంగాణ బిజెపి ఎంపీల మౌనాన్ని విమర్శిస్తూ, పార్టీ విధానాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ చొరవ, సుష్మా స్వరాజ్ మద్దతుతో సాధ్యమైందని తెలిపారు. ఇప్పుడు ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, సంక్షేమ పథకాల్లో దేశంలో ముందంజలో ఉన్న రాష్ట్రాన్ని అవమానించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.ఇటు వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూడాలని, రాష్ట్రాల మధ్య పరస్పర గౌరవం ఉండాలని సూచించారు. అవమానకర వ్యాఖ్యలకు కాంగ్రెస్ చట్టబద్ధంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, బంజారా సంఘ పెద్దలు పాల్గొని, తెలంగాణ గౌరవ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.