అనకాపల్లి గవరపాలెం పై వివక్ష నిలిపివేయాలి – మ్యారేజ్ బ్యూరోలకూ, గవర సంఘాలకు విజ్ఞప్తి
🗞️ బిబి న్యూస్ | 20 Apr 2026
అనకాపల్లి, ఏప్రిల్ 20:అనకాపల్లి గవరపాలెం ప్రాంతానికి చెందిన గవర జాతీయులపై ఉన్న తప్పుడు అభిప్రాయాలు, వివక్షతను వెంటనే నిలిపివేయాలని గవర సంఘ పెద్దలు, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు, కుల పెద్దలకు విశ్రాంతి అధ్యాపకులు కాండ్రేగుల సర్వేశ్వరరావు విజ్ఞప్తి చేశారు .అనకాపల్లి గవరపాలెం గవర జాతికి ప్రధాన కేంద్రంగా నిలిచిందని, ఈ ప్రాంతం నుండి అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాజిక సేవకులు వెలుగులోకి వచ్చి రాష్ట్ర, దేశ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. వి.వి. రమణ, సర్దార్ గౌతు లచ్చన్న, బీశెట్టి అప్పారావు, కొణతాల సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు గవర జాతి అభివృద్ధికి చేసిన సేవలు అపారమని గుర్తుచేశారు.అయితే గతంలో కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం “గవరపాలెం గవర్లు వేరు, ఇతర ప్రాంత గవర్లు వేరు” అనే భావజాలాన్ని పెంచడం వల్ల ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలపై అనవసర అపోహలు కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లి సంబంధాల విషయంలో గవరపాలెం చిరునామాను దాచడం, “GVMC అనకాపల్లి” అని అస్పష్టంగా నమోదు చేయడం వంటి ధోరణులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మ్యారేజ్ బ్యూరో కౌన్సిలర్లు, కన్సల్టెంట్లు బాధ్యత తీసుకుని నిజమైన చిరునామాలను స్పష్టంగా నమోదు చేయించాలని సూచించారు. గవరపాలెం వాస్తవ్యులైతే వీధి పేరు, గవరపాలెం, అనకాపల్లి అని తప్పనిసరిగా నమోదు చేయాలని అన్నారు.గవర జాతి సామాజికంగా ఎంతో ఐక్యతతో, సహాయస్ఫూర్తితో ఉన్నదని, విపత్తుల సమయంలో సహాయక కార్యక్రమాల్లో ముందుండే జాతిగా గుర్తింపు పొందిందని తెలిపారు. కొద్దిపాటి సంఘటనల ఆధారంగా మొత్తం ప్రాంతాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు.ఇక పెళ్లిళ్లలో అధిక ఖర్చులు, కొత్త ఆచారాల పేరుతో మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాలవుతున్నాయని, దీనిపై కూడా కుల పెద్దలు, మ్యారేజ్ బ్యూరోలు సంస్కరణలు తీసుకురావాలని కోరారు.