శంఖరం గ్రామంలో అంబేద్కర్ సామాజిక భవనాన్ని ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన అనకాపల్లి ఎం.పీ
🗞️ బిబి న్యూస్ | 03 May 2026
అనకాపల్లి రూరల్ శంకరం గ్రామంలో నిర్మితమైన అంబేద్కర్ సామాజిక భవనాన్ని స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ మరియు అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేలా గోవింద సత్యనారాయణతో కలిసి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అంబేద్కర్ సామాజిక భవనం గ్రామ ప్రజలకు వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుందని చెప్పారు.ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముందంజలో ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా మహిళలను అయోధ్య దర్శనానికి తీసుకెళ్తామని ఇచ్చిన మాటను ఈ నెల నుంచే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని, తొలి దశలో సుమారు 2000 మంది మహిళలను ఉచితంగా అయోధ్య దర్శనానికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు, అయోధ్యతో పాటు ఆయన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసిని కూడా సందర్శించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.అనంతరం వారణాసి నుంచి అనకాపల్లికి తిరుగు ప్రయాణం ఉండేలా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఎంపీ వివరించారు.అనకాపల్లి జిల్లా అభివృద్ధి దేశవ్యాప్తంగా చర్చకు వస్తోందని, ఇతర పార్లమెంట్ సభ్యులు కూడా జిల్లాను ప్రశంసించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు జిల్లాకు సాధించామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.