తుమ్మపాల రెడీమిక్స్ పబ్లిక్ హియరింగ్‌లో ఉద్రిక్తత: గ్రామస్తులు అనుమతులు రద్దు డిమాండ్
🗞️ బిబి న్యూస్ | 07 May 2026
అనకాపల్లి, మే 7: అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో ప్రతిపాదిత రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్‌పై ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం తీవ్ర ఉద్రిక్తత మధ్య నిలిచిపోయింది.ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఈ పబ్లిక్ హియరింగ్ అధికారుల అలస్యం, సమాచార లోపం కారణంగా వివాదాస్పదంగా మారింది. గ్రామ పరిధిలో సర్వే నెం.04లో 4.90 హెక్టార్లలో మెస్‌ర్స్ ఆర్‌ఎంసీ రెడీమిక్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్లాంట్ సంవత్సరానికి 74,901 క్యూబిక్ మీటర్ల రెడీమిక్స్ కాంక్రీట్, 2,66,410 మెట్రిక్ టన్నుల గ్రావెల్ ఉత్పత్తి చేయనుంది.గ్రామసభ ఆమోదం లేకుండా గతంలోనే కంపెనీకి అనుమతులు ఎలా ఇచ్చారని గ్రామస్తులు ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా అనుమతులు మంజూరు చేసి, ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ కోసం మళ్లీ హియరింగ్ చేయడం సరైనది కాదని ప్రజాసంఘాల నాయకులు మండిపడ్డారు.ఉదయం నిర్వహించాల్సిన సమావేశానికి అధికారులు ఆలస్యంగా మధ్యాహ్నం 1 గంటకు (ఆర్‌డీఓ, APPCB అధికారులు) చేరుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.13 వేల జనాభా గ్రామంలో దండోరా, సమాచారం లేకుండా రహస్యంగా హియరింగ్ ఎలా చేస్తారని ప్రశ్నలు లేవనెత్తారు.పంచాయతీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా క్వారీ యాజమాన్యంతో కుమ్మక్కై ప్రయత్నించారని గ్రామ నాయకులు ఆరోపించారు. “ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎలా? ఇది అధికారుల హియరింగాా?” అంటూ ఆగ్రహం చెప్పుకున్నారు.ప్రజల సమస్యలు పరిష్కరించి, సరైన సమాచారంతో మరో తేదీ నిర్ణయించాలని డిమాండ్‌తో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఉద్రిక్తత పెరిగి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమం కొనసాగలేక అధికారులు వెనక్కి తిరిగారు. స్థానిక నాయకులు పీలా మురళీ తదితరులు పాల్గొన్నారు.