📢 Advertisement Space

డ్వాక్రా రుణాల మంజూరులో తీవ్ర జాప్యం..! జీవీఎంసీ – బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో గ్రూప్ సభ్యుల అవస్థలు

🗞️ బిబి న్యూస్ | 08 Jun 2026

అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాల మంజూరు ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేవలం వారం రోజుల్లో పూర్తయ్యే రుణాల ప్రక్రియ ప్రస్తుతం రెండు నుంచి మూడు నెలల వరకు సాగుతుండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రుణాల కోసం జీవీఎంసీ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ పదేపదే తిరుగుతున్నా అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జాప్యానికి జీవీఎంసీ అధికారులే కారణమా, లేక బ్యాంక్ అధికారులే కారణమా అనే విషయంలో స్పష్టత లేక మహిళా సంఘాల సభ్యులు చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.అంతేకాకుండా ప్రతి దశలో సంతకాలు, ధృవీకరణల పేరుతో కొందరు అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు అధికారుల తీరుతో మరింత ఇబ్బందులు పడుతున్నారని గ్రూప్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం డ్వాక్రా రుణాల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం, జాప్యం కనిపిస్తోందని మహిళలు విమర్శిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి జీవీఎంసీ, బ్యాంక్ అధికారుల పనితీరుపై విచారణ జరిపి, పెండింగ్‌లో ఉన్న రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని డ్వాక్రా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు."మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా ఉండాల్సిన వ్యవస్థే అడ్డంకిగా మారితే, పేద మహిళల పరిస్థితి ఏమిటి?" అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.