📢 Advertisement Space

ఆర్‌టీఈ చట్టాలను ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.అనకాపల్లి కలెక్టరేట్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన

🗞️ బిబి న్యూస్ | 15 Jun 2026

అనకాపల్లి, జూన్ 16 (బీబీ న్యూస్): విద్యా హక్కు చట్టం (RTE) నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు ఉచితంగా యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ తదితర సౌకర్యాలు అందించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చును ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ రూపంలో విద్యాసంస్థలు పొందుతున్నప్పటికీ, కొంతమంది యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివిధ రకాల ఫీజుల పేరుతో భారీ మొత్తాలను వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.అంతేకాకుండా, ఉచితంగా అందించని సౌకర్యాలకు సైతం తప్పుడు బిల్లులు సమర్పించి ప్రభుత్వ నిధులను పొందుతున్నట్లు విమర్శించారు. ఈ విద్యా దోపిడీపై ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుని బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు సురేష్ కుమార్, కన్నబాబు, మదీనా, సంతోష్, కుమార్, వాసు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.