📢 Advertisement Space

అనకాపల్లి జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఉన్నట్టా? లేనట్టా?

🗞️ బిబి న్యూస్ | 18 Jun 2026

అనకాపల్లి, జూన్ 18:
అనకాపల్లి జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు స్వయంగా పుస్తకాలు, నోట్‌బుక్స్ విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరంలో కొత్త పుస్తకాలు తప్పనిసరి అంటూ పాత పుస్తకాలను ఉపయోగించకుండా చేయడం ద్వారా వేల రూపాయల ఖర్చు పెట్టిస్తున్నారని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.ఇలాంటి వ్యవహారాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుస్తకాల విక్రయాలు బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది."ముందు పుస్తకాలు అమ్మేసుకోండి... తర్వాత మేము వస్తాం" అన్నట్టుగా అధికారుల వ్యవహార శైలి ఉందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.ప్రైవేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతూ పుస్తకాలను తరచూ మార్చి విక్రయిస్తున్న నేపథ్యంలో, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు."ఫిర్యాదులు చేసినా స్పందన లేదు... ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనం?" అనే ప్రశ్న ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.