📢 Advertisement Space

610 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

🗞️ బిబి న్యూస్ | 24 Jun 2026

అనకాపల్లి, జూన్ 24: అనకాపల్లి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన భారీ గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.పోలీసుల వివరాల ప్రకారం, 2016 సెప్టెంబర్ 26న రావికమతం మండలం దొండపూడి ఫారెస్ట్ చెక్ గేట్ వద్ద నిఘా నిర్వహించిన కొత్తకోట పోలీసులు అనుమానాస్పదంగా వెళ్తున్న మహీంద్రా బొలెరో వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో ఊక బస్తాల మధ్య అక్రమంగా తరలిస్తున్న 610 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో డ్రైవర్ గంట్యాడ చిట్టిబాబును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా, మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసును విచారించిన చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు నిందితుడు గంట్యాడ చిట్టిబాబుపై నేరం రుజువైందని నిర్ధారించి, NDPS చట్టం కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండేళ్ల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.అలాగే కేసులో పట్టుబడిన 610 కిలోల గంజాయిని కోర్టు స్వాధీనం చేసుకోవాలని తీర్పులో పేర్కొంది. కాగా, ఈ కేసులోని మిగిలిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి కొత్తకోట ఎస్సై డి.శేఖరం, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురుపల్లి సూర్యనారాయణ, ప్రస్తుత కొత్తకోట పోలీసు సిబ్బంది మరియు కోర్టు మానిటరింగ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ అభినందించారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.