కశింకోటలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ భారీ అవగాహన ర్యాలీ
🗞️ బిబి న్యూస్ | 26 Jun 2026
కశింకోట: మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కశింకోటలో భారీ అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనకాపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డీపీఓ) ఎం. శ్రావణి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల, డీపీఎన్ బాలుర పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ర్యాలీలో విద్యార్థులు "వద్దు బ్రో... డ్రగ్స్ వద్దు బ్రో", "డ్రగ్స్‌కు నో... జీవితానికి యెస్", "మత్తుకు దూరం... ఆరోగ్యానికి చేరువ" వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కశింకోట గ్రామ పెద్దలు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, వేగి గోపి, వేగి వెంకటరావు, దాడి నాగరాజు, బొబ్బరి పవన్, చిడిరెడ్డి శ్రీనివాసరావు, దాసరి బాబు, నడిపల్లి సన్యాసిరావు (ఎంపీటీసీ), పవాడ కామరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే సీఐ అల్లు స్వామి నాయుడు, ఎస్‌ఐలు కె. లక్ష్మణరావు, సతీష్, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.