గంజాయి స్మగ్లర్లపై కశింకోట పోలీసుల ఉక్కుపాదం 60 కేజీల గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్ట్
🗞️ బిబి న్యూస్ | 11 Aug 2026
కశింకోట: గంజాయి అక్రమ రవాణాపై కశింకోట పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కశింకోట గ్రామ పరిధిలోని ఎన్‌హెచ్–16పై హెచ్‌ఓపీ హోటల్ ఎదురుగా పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.అనుమానాస్పదంగా వచ్చిన ఓ ఆటోతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా, ఆటో వెనుక భాగంలో రెండు గోనె సంచుల్లో దాచిన 30 ప్యాకెట్లలో 60 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.అరెస్టయిన వారిలో కాకినాడ జిల్లాకు చెందిన గాడి రత్నంరాజు (28), రాజమండ్రికి చెందిన గోబెరు వెంకట చైతన్య (34), ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన గుంత హిమాన్సు శేఖర్ అలియాస్ జోష్ (22), కారా కేసరి అలియాస్ కొర్రా కిశోర్ (32) ఉన్నారు. పరారైన మర్రి ఘాషి అలియాస్ రవి అలియాస్ చిన్నా కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితుడు గాడి రత్నంరాజు అరకు ప్రాంతం నుంచి సుమారు 60 కేజీల గంజాయిని కొనుగోలు చేసి రాజమండ్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడైంది. మిగిలిన నిందితులు గంజాయి రవాణాలో ఆటో డ్రైవర్, పైలట్‌లుగా సహకరించినట్లు పోలీసులు తెలిపారు.స్వాధీనం చేసుకున్న వాటిలో 60 కేజీల గంజాయి, బజాజ్ ఆటో రిక్షా (AP 31 TG 8931), బజాజ్ పల్సర్ NS 200 (AP 40 HD 0752), యమహా FZ-S (AP 07 CB 4775), నాలుగు మొబైల్ ఫోన్లు ఉన్నాయి.కశింకోట సీఐ స్వామి నాయుడు పర్యవేక్షణలో ఎస్‌ఐ కె. లక్ష్మణరావు, ఏఎస్‌ఐ శ్యామ్ సుందర్, హెచ్‌జీ డి.ఎస్. బాబు తదితర సిబ్బంది వాహన తనిఖీల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఏఎస్‌ఐ శ్యామ్ సుందర్, హెచ్‌జీ డి.ఎస్. బాబును జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా నగదు బహుమతి, ప్రశంసాపత్రంతో అభినందించారు.ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 168/2026, ఎన్‌డీపీఎస్ చట్టం 1985లోని సెక్షన్ 20(b)(ii)(C) రెడ్‌విత్ 8(c), సెక్షన్ 25 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తులు, సరఫరా మార్గాలు, నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.