అనకాపల్లిలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ’
🗞️ బిబి న్యూస్ | 13 Aug 2026
అనకాపల్లి, ఆగస్టు 13: దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అనకాపల్లిలో గురువారం సాయంత్రం ‘హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ’ని దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డ్ నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ర్యాలీ ప్రారంభానికి ముందు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్, కార్పొరేషన్ చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ళా సురేంద్ర తదితరులు మార్కెట్ యార్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సైకిళ్లపై ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మార్కెట్ యార్డు వద్ద విద్యార్థులు ప్రదర్శించిన స్కేటింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి అవార్డులు సాధించిన చిన్నారుల నైపుణ్యాన్ని ప్రజాప్రతినిధులు అభినందించారు.ర్యాలీ నాలుగు రోడ్ల జంక్షన్‌కు చేరుకున్న అనంతరం ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. అనకాపల్లి ప్రజలంతా వేడుకల్లో భాగస్వాములు కావాలని కోరారు.ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ “ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్‌ను నిలపాలి” అని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు యువత పునరంకితం కావాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని కోరారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సోదరభావంతో ముందుకు సాగుతూ ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు.అలాగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన స్కేటింగ్ క్రీడాకారులకు ఆగస్టు 15న కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తామని కొణతాల రామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం స్కేటింగ్ పిల్లలు రోడ్లపై ప్రాక్టీస్ చేస్తూ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో VMRDA ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన స్కేటింగ్ రింగ్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి నగరంలోని కీలకమైన నెహ్రూ చౌక్ జంక్షన్‌లో ప్రత్యేక క్లాక్ టవర్ ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో నాగ జగదీష్, ద్వారపూడి పరమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.