📢 Advertisement Space

అనకాపల్లిలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ వార్షికోత్సవ వేడుకలు...జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్డీవోకు వినతిపత్రం

🗞️ బిబి న్యూస్ | 17 Aug 2026

అనకాపల్లి, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 70వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కొత్తూరు పంచాయతీ పరిధిలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఆర్డీవో ఆయిషా, అడిషనల్ ఎస్పీ ఎల్. మోహన్‌రావు ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా నిలుస్తూ నిరంతరం ప్రజా సమస్యలు, సంక్షేమ అంశాలను వెలుగులోకి తీసుకువస్తున్నారని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.యూనియన్ నాయకులు పెంటకోట జోగినాయుడు, రాష్ట్ర నాయకులు మద్దాల రాంబాబు, ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రింట్ మీడియా అధ్యక్షుడు మళ్ల భాస్కర్‌రావు, ఉపాధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చాగంటి సర్వారావు (అవ్వ), కార్యదర్శి భీమరశెట్టి నూకేష్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే 1956 ఆగస్టు 17న ఆవిర్భవించిందని, 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 70వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అనకాపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలోనూ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం మేరకు ఆగస్టు 17, 2026 నుంచి ఏడాది పొడవునా ప్లాటినం జూబిలీ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీవో ఆయిషాకు వినతిపత్రం అందజేశారు.వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూటమి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పాత్రికేయ పింఛను పథకాన్ని ప్రారంభించాలని, జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మళ్ల అంజిబాబు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సభ్యులు ఎం. శ్రీను, మొన్న, జనార్ధన్, అనకాపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు యల్లపు వెంకట రమణాజీ, బొద్ధపు కిరణ్‌కుమార్, దొడ్డి శ్రీనివాసరావు, ఎన్. మణికుమార్, బోసు, శ్రీను, సాయి, చిన్న, నటరాజ్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.