అనకాపల్లి: SIR కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజుకు సచివాలయ BLO నోటీసు జారీ చేయడంతో, వివరణ ఇచ్చేందుకు ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. ఆనందరావును కలిసి సంబంధిత పత్రాలను అందించారు.ఈ సందర్భంగా జానకిరామరాజుతో పాటు ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ.. 2002, 2024 ఓటర్ల జాబితాల్లో తండ్రి పేరు ముందు ఇంటిపేరు లేకపోయినా, ప్రస్తుతం ఇంటిపేరు ఉందనే కారణాలతో ఓట్లు తొలగించే చర్యలు చేపట్టడం సరికాదన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పొరపాట్లను వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో కోన ఉమా, సమ్మంగి కనకారావు, తంగెల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.