అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో రికార్డులు భద్రం...సస్పెండ్ అయిన ఉద్యోగి వ్యక్తిగత వస్తువులే తీసుకెళ్లారు: అధికారులు
🗞️ బిబి న్యూస్ | 02 Sep 2026
అనకాపల్లి, సెప్టెంబర్ 2 (న్యూస్):
అనకాపల్లి మైన్స్ అండ్ జియాలజీ శాఖ కార్యాలయంలో ఎలాంటి ప్రభుత్వ రికార్డులు తస్కరించబడలేదని మైన్స్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఏసీబీ ట్రాప్ నేపథ్యంలో సస్పెండ్ అయిన సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ సోమవారం కార్యాలయానికి వచ్చి తనకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు మాత్రమే తీసుకెళ్లారని అధికారులు తెలిపారు.క్యారియర్, మెడికల్ కిట్, ఆసుపత్రి నివేదికలు తదితర వ్యక్తిగత వస్తువులను మాత్రమే ఆయన తీసుకెళ్లారని, ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఎలాంటి రికార్డులు ఆయన తీసుకెళ్లలేదని అధికారులు వెల్లడించారు. గత రెండు రోజులుగా ప్రసార మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలపై స్పందించిన అధికారులు, రికార్డులు తస్కరించారనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, నిజానిజాలు నిర్ధారించుకోకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని అధికారులు సూచించారు. ఆధారాలు లేకుండా వ్యక్తులపై నిందలు మోపితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
అక్రమ మైనింగ్ అంశంలో రాజకీయ చర్చ
ఇదిలా ఉండగా, అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్‌పై మైన్స్ అధికారులు ఇటీవల వరుస తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి మండలం పంచదార్ల కొండతో పాటు అనకాపల్లి మండలం వేటజంగాలపాలెం రెవెన్యూ పరిధిలోని 84వ సర్వే నంబర్‌లో అక్రమ మైనింగ్‌పై చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ పరిణామాల నేపథ్యంలో మైన్స్ శాఖ కార్యాలయం చుట్టూ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు తెరపైకి వస్తున్నాయి. ఆగస్టు 6న అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించిన ఘటన కూడా చర్చనీయాంశంగా మారింది.అయితే, సస్పెండ్ అయిన ఉద్యోగిపై వచ్చిన ఆరోపణలు, కార్యాలయంలో రికార్డుల భద్రత, రాజకీయ ఒత్తిళ్లకు సంబంధించిన అంశాలపై పూర్తి వాస్తవాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.