📢 Advertisement Space

నర్సింగరావుపేటలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

🗞️ బిబి న్యూస్ | 05 Sep 2026

అనకాపల్లి: నర్సింగరావుపేటలో శ్రీకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఆధ్యాత్మిక వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు శ్రీకృష్ణ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా పూజా కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు.అనంతరం శ్రీకృష్ణుడి బాల్యలీలలకు ప్రతీకగా నిర్వహించిన ఉట్టి సంబరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SD గ్రూప్స్ అధినేత, దుర్గమ్మ సేవకుడు, కృష్ణయ్య సాధకుడు కాండ్రేగుల శ్రీరామ్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఉట్టి కొట్టి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీ కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి బోధనలు ధర్మమార్గంలో నడిపించే దివ్య సందేశాలని, భక్తి, ధర్మం, సత్యం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని అన్నారు. నర్సింగరావుపేటలో తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.శ్రీకృష్ణ నామస్మరణలు, భజనలు, పూజా కార్యక్రమాలతో నర్సింగరావుపేట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణ స్వామివారి ఆశీస్సులు పొందారు.