82వ వార్డులో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పర్యటన
🗞️ బిబి న్యూస్ | 07 Sep 2026
అనకాపల్లి: మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ 82వ వార్డులో సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఉదయం 6 గంటల నుంచే గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, పూర్తయిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జరుగుతున్న, మంజూరైన పనుల పురోగతిపై జివిఎంసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత రెండేళ్లలో 82వ వార్డులో సుమారు 41 అభివృద్ధి పనులకు రూ.16.59 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనతో పోలిస్తే కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే మరింత విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టిందని పేర్కొన్నారు.గాంధీనగర్, అంజయ్య కాలనీ, విజయరామరాజుపేట, శ్రీరామ్‌నగర్ కాలనీ, పెదరెల్లి వీధి, చవితిన వీధి, నర్సింగరావుపేట, పల్లివారి దొడ్డి తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, కమ్యూనిటీ హాళ్లు, ఎన్టీఆర్ గ్రౌండ్‌లో బౌండరీ వాల్ తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.శ్రీరామ్‌నగర్ కాలనీలో రూ.45 లక్షలతో కమ్యూనిటీ హాల్, పెదరెల్లి వీధిలో రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇతర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రావు గోపాలరావు కళాక్షేత్రాన్ని సుమారు రూ.5 కోట్లతో పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నాయకులు వెల్లడించారు.పర్యటన సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక సమస్యలకు అవసరమైన చర్యలు తీసుకుని టెండర్లు పిలిచి పనులను త్వరితగతిన ప్రారంభించాలని జివిఎంసి అధికారులకు సూచించారు.