జర్నలిజం విలువలు కాపాడాలి.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి
🗞️ బిబి న్యూస్ | 10 Sep 2026
అనకాపల్లి:స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.ఇదే సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు రాజకీయ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ,వాస్తవాలను పూర్తిగా నిర్ధారించకుండానే వార్తలు రాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.రాజకీయ నాయకులు,కార్యకర్తలకు అనుకూలంగా వార్తలు రాస్తూ ప్రచారానికి,వార్తా కథనానికి మధ్య ఉన్న తేడాను చెరిపివేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అలాగే కొందరు జర్నలిస్టులు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా చోటుచేసుకునే పరిణామాలను ప్రజలకు వాస్తవ రూపంలో అందించడం మీడియా బాధ్యత అని పలువురు నాయకులు పేర్కొంటున్నారు.వ్యక్తిగత ప్రచారానికి లేదా రాజకీయ ప్రయోజనాలకు వార్తలను వేదికగా మార్చడం వల్ల జర్నలిజం ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని వారు అంటున్నారు.ప్రజలకు సంబంధించిన సమస్యలు,అభివృద్ధి పనులు,మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల అమలు,ప్రజల ఇబ్బందులపై జర్నలిస్టులు మరింత దృష్టి సారించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.ఏ వార్త అయినా ప్రచురించే ముందు వాస్తవాలను పూర్తిగా నిర్ధారించుకుని, అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుని రాస్తే జర్నలిజం విశ్వసనీయత మరింత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.ఎన్నికల వేడి ఎంత పెరిగినా జర్నలిజం మాత్రం నిష్పక్షపాతంగా,ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.