📢 Advertisement Space

జీవీఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిపై పరిశీలన చేయాలి — 80వ వార్డు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ కె.ఎం. నాయుడు

🗞️ బిబి న్యూస్ | 25 Sep 2026

అనకాపల్లి: రాబోయే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల నిర్వహణలో ఓటర్లకు మరింత విశ్వాసం కలిగించే విధంగా ఓటింగ్ విధానంపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని 80వ వార్డు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ కె.ఎం. నాయుడు కోరారు.జీవీఎంసీ పరిధిలోని 120 వార్డులకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఓటింగ్ విధానంపై రాజకీయ పార్టీలు, ప్రజలు, ఎన్నికల నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 120 వార్డులకు సంబంధించి ఓటర్ల జాబితాలు ఇప్పటికే ప్రచురించబడ్డాయని, మొత్తం 18,29,966 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలు, భద్రత, పారదర్శకత, ఓట్ల లెక్కింపు తదితర అంశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సమగ్రంగా పరిశీలించాలని కె.ఎం. నాయుడు కోరారు. ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి సందేహాలు తలెత్తకుండా, ప్రతి ఓటు విలువను కాపాడే విధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని అన్నారు.అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో బ్యాలెట్ విధానంపై కొనసాగుతున్న చర్చలను ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల విధానాలపై జరుగుతున్న అంతర్జాతీయ చర్చలో భాగంగా చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి తుది నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘం, సంబంధిత చట్టాలు మరియు నిబంధనల ప్రకారమే ఉంటుందని కె.ఎం. నాయుడు స్పష్టం చేశారు.