📢 Advertisement Space

గుంతలమయంగా ఎస్ఈజెడ్ కాలనీ రహదారులు

🗞️ బిబి న్యూస్ | 26 Sep 2026

భారీ వాహనాల రాకపోకలతో మరింత అధ్వానం.. ప్రజలకు తప్పని ఇబ్బందులు
అచ్యుతాపురం, సెప్టెంబర్ 26: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్ఈజెడ్ కాలనీలో రహదారులు అత్యంత దారుణంగా మారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వియ్యపు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.సుమారు 5,000 ఇళ్లలో 10,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో రహదారులు పూర్తిగా గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఎస్ఈజెడ్ పరిధిలోని ఫార్మా తదితర పరిశ్రమలకు చెందిన భారీ వాహనాలు నిత్యం కాలనీ మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో రహదారులు మరింత దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.కాలనీలోని ప్రధాన రహదారులతో పాటు టవర్ లైన్‌కు ఇరువైపులా ఉన్న రోడ్లు కూడా పెద్దపెద్ద గుంతలతో అధ్వానంగా మారాయని వియ్యపు కృష్ణ తెలిపారు. వర్షం పడిన సమయంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. భారీ వాహనాల రాకపోకలతో దుమ్ము, కాలుష్యం, శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ఇబ్బందులను అధికారులు పట్టించుకోవడం లేదని, రహదారుల దుస్థితిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వియ్యపు కృష్ణ అన్నారు. గ్రామ పంచాయతీ, ఏపీఐఐసీ అధికారులు, సంబంధిత పరిశ్రమల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.గుంతలను పూడ్చడంతో పాటు రహదారులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని, పరిశ్రమల భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసి కాలనీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.