అనకాపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారమే పునాది: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ
🗞️ బిబి న్యూస్ | 08 Oct 2026
అనకాపల్లి, అక్టోబర్ 8 (బీబీ న్యూస్): చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తొలి ఐదు సంవత్సరాలు అత్యంత కీలకమని అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. సేవా సంకల్ప అభియాన్–2026లో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్ సహకారంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలోని క్రిటికల్ కేర్ బ్లాక్ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసం–2026లో భాగంగా ‘ఆరోగ్యమైన బిడ్డ–ఆనందకరమైన కుటుంబం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా సీమంతాలు నిర్వహించారు. అంగన్వాడీ ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన వివిధ వైద్య పరీక్షల విభాగాలు, ఆరోగ్య అవగాహన కేంద్రాలను అతిథులు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి తొలి ఐదేళ్లలో అందించే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య ఎంతో ముఖ్యమన్నారు. అంగన్వాడీ కేంద్రాలు కేవలం పోషకాహారం అందించే కేంద్రాలుగానే కాకుండా పిల్లల సమగ్ర అభివృద్ధికి పునాది వేసే కేంద్రాలుగా పనిచేయాలని సూచించారు.పిల్లల ఎదుగుదలలో లోపాలను ముందుగానే గుర్తించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై తల్లిదండ్రులకు నిరంతరం అవగాహన కల్పించాలన్నారు.మంచి పోషకాహారమే మంచి ఆరోగ్యానికి పునాది అని, పిల్లలు ఆరోగ్యంగా ఎదిగినప్పుడే సమాజానికి మంచి భవిష్యత్తు ఉంటుందని కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.