జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం శాంతియుత దీక్షకు సిద్ధమైన కోరిబిల్లి పరి
🗞️ బిబి న్యూస్ | 13 Oct 2026
పాత్రికేయుల గృహ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం
అనకాపల్లి, అక్టోబర్ 12 (బీబీ న్యూస్):
అనకాపల్లి జిల్లాలో పత్రికా విలేకరులు, దృశ్య మాధ్యమాల ప్రతినిధులకు ఇళ్ల స్థలాలు, గృహాల కేటాయింపు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసేవకుడు, సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపకుడు, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ వేదిక అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కోరిబిల్లి పరి శాంతియుత దీక్షకు సిద్ధమయ్యారు.జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రత్యేకంగా దీక్ష చేపడుతున్నట్లు కోరిబిల్లి పరి ప్రకటించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు.ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో, అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని పరి పేర్కొన్నారు. సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులకు కనీసం సొంత ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు.ఎన్నో ప్రభుత్వాలు మారినా అనకాపల్లి జిల్లాలోని అనేక మంది పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు, గృహాల కేటాయింపు సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల కోసం పోరాడే జర్నలిస్టుల సమస్యలను కూడా ప్రభుత్వం ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం కేవలం మాటలకే పరిమితం కాకుండా, వారి ఇళ్ల స్థలాల సమస్యపై ప్రత్యక్షంగా శాంతియుత దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు కోరిబిల్లి పరి తెలిపారు.అర్హులైన పత్రికా విలేకరులు, దృశ్య మాధ్యమాల ప్రతినిధులను గుర్తించి, వారికి ఇళ్ల స్థలాలు లేదా గృహాలు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ శాంతియుత దీక్షకు జిల్లాలోని పాత్రికేయ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు తెలియజేయాలని పరి కోరారు."ప్రజల కోసం కలం పట్టే జర్నలిస్టులకు సొంతింటి భరోసా కల్పించడమే మా లక్ష్యం. వారి సమస్యల పరిష్కారం కోసం మా పోరాటం కొనసాగుతుంది" అని కోరిబిల్లి పరి పేర్కొన్నారు.