📢 Advertisement Space

అనకాపల్లిలో రూ.12.82 కోట్లతో అభివృద్ధి పనులు

🗞️ బిబి న్యూస్ | 13 Oct 2026

అనకాపల్లి, అక్టోబర్ 13 (బీబీ న్యూస్): అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి వీఎంఆర్డీఏ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. కొత్తూరు పంచాయతీ పరిధిలో రూ.12.82 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన పనుల ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ కొత్తూరులో రూ.5.40 కోట్లతో చేపట్టిన తెలుగుతల్లి ఉద్యానవనం మొదటి విడత పనులు పూర్తయ్యాయని తెలిపారు. రెండో విడత అభివృద్ధి పనులకు రూ.2.96 కోట్లు మంజూరయ్యాయని, ఆ పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు. అలాగే బీఆర్టీ కాలనీలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా రూ.4.46 కోట్లతో కల్యాణ మండపం నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.ఇటీవల రూ.5.30 కోట్లతో రావుగోపాలరావు కళాక్షేత్రాన్ని ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.అనకాపల్లిని పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. మార్కెట్ యార్డు, డీసీఎంఎస్ ప్రాంతాల్లో ఆధునిక వాణిజ్య, కార్యాలయ సముదాయాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.అనకాపల్లి అభివృద్ధికి సహకరిస్తున్న వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులను ఎమ్మెల్యే అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, వీఎంఆర్డీఏ అధికారులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.