అనకాపల్లిలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలు
🗞️ బిబి న్యూస్ | 15 Oct 2026
అనకాపల్లి, అక్టోబర్ 15 (బీబీ న్యూస్):
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలను అనకాపల్లి పట్టణంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ బాషా ఆదేశాల మేరకు, అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి నివాళులర్పించి, దేశానికి ఆయన అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. సామాన్య కుటుంబంలో జన్మించి శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థాయికి ఎదిగిన అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని నాయకులు పేర్కొన్నారు.దేశ శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి కలాం చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం శ్రమించాలని సూచించారు. కలలు కనడం మాత్రమే కాకుండా వాటిని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో కృషి చేయాలన్న కలాం సందేశాన్ని ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు షేక్ బాబాజీ, రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇబ్రహీం భాష, జిల్లా నాయకుడు బురాన్, జిల్లా ఉపాధ్యక్షులు కందారపు రమణమూర్తి, పలకరావు, జిల్లా కార్యదర్శి బొడ్డేటి నాగేశ్వరరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అచ్చంనాయుడు, చోడవరం మండల అధ్యక్షుడు రాజు, రోలుగుంట మండల అధ్యక్షుడు గజ్జి సాంబశివ, చోడవరం మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కర్రి తమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.