📢 Advertisement Space

అచ్యుతాపురం జడ్పీటీసీ అభ్యర్థిగా నర్మాల సుహాసిని నామినేషన్ దాఖలు

🗞️ బిబి న్యూస్ | 22 Oct 2026

వైఎస్సార్‌సీపీ నాయకుల సమక్షంలో నామినేషన్ సమర్పణ – అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు
అనకాపల్లి, బీబీ న్యూస్:
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలోని అచ్యుతాపురం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నర్మాల సుహాసిని (కుమార్) బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణకు ఆమె తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అభ్యర్థికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా నర్మాల సుహాసిని మాట్లాడుతూ తనపై నమ్మకంతో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని సుహాసిని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలంలోని గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో ముందుకు సాగుతానని ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నర్మాల సుహాసిని అభ్యర్థిత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేసి ఆమె విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు, లాలం రాంబాబు, కోన బుజ్జి, బలిరెడ్డి శ్రీను, భీముని వెంకటేశ్వరరావు, గంగిరెడ్డి రాము, రవీంద్రరాజు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.