తెలుగుదేశం పార్టీలో చేరిన నాగులపల్లి యువనాయకుడు కాండ్రేగుల చందు
🗞️ బిబి న్యూస్ | 25 Oct 2026
అనకాపల్లి, బీబీ న్యూస్:అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన యువనాయకుడు కాండ్రేగుల చందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు సమక్షంలో చందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాండ్రేగుల చందు పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నాగులపల్లి గ్రామంతో పాటు మునగపాక మండలంలో యువతతో చందుకు ఉన్న పరిచయాలు, ప్రజలతో ఆయన కొనసాగిస్తున్న సంబంధాలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయని టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు.
పార్టీలో చేరిన వెంటనే కీలక బాధ్యతలు
కాండ్రేగుల చందు నాయకత్వ లక్షణాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించగల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రగడ నాగేశ్వరరావు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలమంచిలి మున్సిపాలిటీ, మునగపాక మండలాలకు ఎన్నికల పరిశీలకుడిగా ఆయనను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో చేరిన వెంటనే రెండు ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికల బాధ్యతలు అప్పగించడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడం వంటి బాధ్యతలను చందు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా – కాండ్రేగుల చందు
ఈ సందర్భంగా కాండ్రేగుల చందు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రగడ నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, యువతను ప్రోత్సహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తానని తెలిపారు. నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.కాండ్రేగుల చందు చేరికతో నాగులపల్లి గ్రామంతో పాటు మునగపాక మండలంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయనకు అప్పగించిన బాధ్యతలు పార్టీ సంస్థాగత కార్యక్రమాలకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మునగపాక మండల టీడీపీ అధ్యక్షులు పెంటకోట విజయ, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆడారి మంజు, మద్దాల దొరంనాయుడు, ఆడారి సత్యనారాయణ, వాసు, దాడి శివ, సురిశెట్టి అప్పలనాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు.