అత్తింటి వేధింపులు తాళలేక ఇల్లు వదిలిన వివాహిత.. న్యాయం చేయాలని మహిళా పోలీసులను ఆశ్రయం!
🗞️ బిబి న్యూస్ | 11 Nov 2026
అనకాపల్లి: అత్తింటి వేధింపులు భరించలేక ఇల్లు వదిలి బయటకు వచ్చిన ఓ వివాహిత తనకు న్యాయం చేయాలని కోరుతూ అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. తన భర్త, ఆడపడుచు, ఇతర కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని మరుపల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో పెద్దల సమక్షంలో రాజు అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వివాహమైన మొదటి ఐదేళ్ల పాటు దాంపత్య జీవితం సజావుగానే సాగిందని, ఆ తర్వాత భర్త, ఆడపడుచు ఇంద్రజతో పాటు కుటుంబ సభ్యులు వివిధ కారణాలతో తనను వేధించడం ప్రారంభించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విషయంపై గతంలో అమృతాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిందని తెలిపారు. అయితే రాజీ అనంతరం కూడా వేధింపులు కొనసాగాయని, దీంతో అక్టోబర్ 18న వేధింపులు భరించలేక ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడించారు.ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు భర్త వద్దనే ఉన్నారని, పిల్లలకు తన గురించి తప్పుడు సమాచారం చెబుతూ తన వద్దకు రాకుండా చేస్తున్నారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి ఇంటికి వస్తే కాళ్లు విరగ్గొడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.తన భర్త రాజు, ఆడపడుచు ఇంద్రజతో పాటు వేధింపులకు పాల్పడిన ఇతర కుటుంబ సభ్యులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించడంతో పాటు తన పిల్లలతో కలిసే అవకాశం కల్పించి న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను కోరారు.మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.