📢 Advertisement Space

JEE మెయిన్స్ దరఖాస్తుల్లో జాప్యం.. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన!

🗞️ బిబి న్యూస్ | 11 Nov 2026

కొత్త OBC-NCL సర్టిఫికెట్ల జారీ ఆలస్యంతో ఇబ్బందులు – రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలి: కొరిబిల్లి పరి
అనకాపల్లి:
JEE మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సిన విద్యార్థులు కొత్త OBC-NCL (నాన్ క్రీమీ లేయర్) కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో పొందిన సర్టిఫికెట్లు ప్రస్తుత దరఖాస్తు ప్రక్రియలో ఆమోదం పొందడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో కొత్త సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సకాలంలో పత్రాలు అందకపోవడంతో దరఖాస్తులు పూర్తి చేయలేక ఆందోళన చెందుతున్నారు.
రెవెన్యూ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు
ఎన్నికల విధులు, కౌంటింగ్ సంబంధిత పనులు, రెవెన్యూ సర్వర్లలో సాంకేతిక సమస్యలు తదితర కారణాలతో కొత్త OBC-NCL సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాకపోవడం, సంబంధిత అధికారుల ఆమోదం, MRO సంతకాలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పరీక్ష కేంద్రాల ఎంపికపై విద్యార్థుల్లో ఆందోళన
JEE మెయిన్స్ దరఖాస్తుల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సర్టిఫికెట్లు సకాలంలో అందకపోతే దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కోల్పోతామేమోనని, దూర ప్రాంతాలైన రాజమండ్రి, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందేమోనని ఆవేదన చెందుతున్నారు.
NTA స్పష్టత ఇవ్వాలి.. పెండింగ్ సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలి
OBC-NCL సర్టిఫికెట్ జారీ ఆలస్యమైన అభ్యర్థులకు డిక్లరేషన్ లేదా ఇతర ప్రత్యామ్నాయ పత్రాల ఆధారంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అలాంటి అవకాశం నిబంధనల్లో ఉంటే దాని వివరాలను వెంటనే తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, MRO అధికారులు పెండింగ్‌లో ఉన్న సర్టిఫికెట్ల దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి త్వరితగతిన జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన సమస్యపై నిర్లక్ష్యం వద్దు
ఈ సమస్యపై స్పందించిన కొరిబిల్లి పరి మాట్లాడుతూ.. JEE మెయిన్స్ అనేది విద్యార్థుల ఉన్నత విద్య, భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కీలకమైన పరీక్ష అని, కేవలం సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న జాప్యం కారణంగా విద్యార్థులు విలువైన అవకాశాలను కోల్పోకూడదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులు, సంబంధిత MROలు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి OBC-NCL సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కొరిబిల్లి పరి విజ్ఞప్తి చేశారు.