📢 Advertisement Space

బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాల చోరీ.. నిందితుడి అరెస్ట్

🗞️ బిబి న్యూస్ | 12 Nov 2026

అనకాపల్లి, నవంబర్ 12: అనకాపల్లి పట్టణంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును టౌన్ పోలీసులు ఛేదించారు. బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలను చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి మొత్తం 45.190 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి పట్టణంలోని గాంధీనగరం ప్రాంతానికి చెందిన మెల్లిపాక ప్రమీల ఇంట్లో గత ఆగస్టు నెలలో గుర్తుతెలియని వ్యక్తి బీరువా తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలను అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 161/2026, సెక్షన్ 305(a) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు అనకాపల్లి టౌన్ ఎస్‌ఐ ఎ. వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి గురువారం (నవంబర్ 12) మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పట్టణంలోని సిటీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, లక్ష్మీదేవిపేట రైల్వే గేట్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.అరెస్టయిన నిందితుడు పోణకర్లపల్లి నాగేంద్రకుమార్ (25)గా పోలీసులు గుర్తించారు. ఇతను అనకాపల్లి పట్టణంలోని అంజయ్య కాలనీ, గాంధీనగరంలో నివాసం ఉంటున్నాడు. ఇతని స్వస్థలం కె.కోటపాడు మండలంలోని గుల్లిపల్లి గ్రామం.
స్వాధీనం చేసుకున్న ఆభరణాలు:
- బంగారు నల్లపూసల తాడు – 24.840 గ్రాములు
- బంగారు నెక్లెస్ – 8.500 గ్రాములు
- బంగారు చైనుతో కూడిన లాకెట్ – 6.420 గ్రాములు
- బంగారు బ్రాస్లెట్ – 3.140 గ్రాములు
- బంగారు ఉంగరం – 2.290 గ్రాములు
మొత్తం 45.190 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టి గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.ఈ కేసు ఛేదనలో ఎస్‌ఐ ఎ. వెంకటేశ్వరరావుతో పాటు కానిస్టేబుళ్లు PC-2178 ఎం. సముద్రం, PC-2291 ఆర్.పి. నాయుడు, PC-2342 టి.ఎస్. నాయుడు పాల్గొన్నారు. కేసును ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులను, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు మార్గదర్శకత్వంలో, సీఐ జి. ప్రేమ్ కుమార్ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగింది.