పిసినికాడ అభివృద్ధికి కొత్త దిశ చూపడమే లక్ష్యం.. స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళ నాగ బాల వెంకటి నామినేషన్
🗞️ బిబి న్యూస్ | 16 Nov 2026
20 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని గ్రామ సమస్యలకు చరమగీతం పాడుతానంటూ ఎన్నికల బరిలోకి.. ప్రజల ఆశీస్సులే తన బలమని వెల్లడి...
పిసినికాడ, బీబీ న్యూస్: గ్రామ అభివృద్ధిపై బలమైన సంకల్పంతో, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా పిసినికాడ గ్రామానికి చెందిన మళ్ళ పొట్టి అప్పారావు (బ్యాంక్) కోడలు మళ్ళ నాగ బాల వెంకటి సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నేడు ఆమె నామినేషన్ దాఖలు చేశారు.గత 20 సంవత్సరాలుగా పిసినికాడ గ్రామంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతోనే రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.సర్పంచ్ పదవి అనేది కేవలం ఒక హోదా మాత్రమే కాదని, అది గ్రామ ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలు తనకు ఒక్క అవకాశం కల్పిస్తే గ్రామంలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని కలుపుకొని అందరి అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ సమిష్టి కృషితో పిసినికాడను అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.మాటలకే పరిమితం కాకుండా చేతల్లో అభివృద్ధిని చూపించాలనే సంకల్పంతో ప్రజల ముందుకు వస్తున్నానని పేర్కొంటూ, తన ఎన్నికల ప్రయాణానికి గ్రామ ప్రజలు ఆశీస్సులు, ఆదరణ, మద్దతు అందించాలని మళ్ళ నాగ బాల వెంకటి విజ్ఞప్తి చేశారు.గ్రామ భవిష్యత్తు కోసం మార్పు కోరుకుంటున్న ప్రజల మద్దతుతో సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించి పిసినికాడ అభివృద్ధికి బాటలు వేయాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.