📢 Advertisement Space

వైభవంగా శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ట పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు

🗞️ బిబి న్యూస్ | 08 Mar 2026

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదేవతగా భావించే అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ పునఃప్రతిష్ట మరియు రాజగోపుర కలశ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు విశ్వసించే అమ్మవారి ఈ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన సతీమణి పద్మావతితో కలిసి హాజరయ్యారు.ఆలయ ప్రాంగణానికి చేరుకున్న స్పీకర్ దంపతులకు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం నూతన ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన పసిడి కలశాల నీరాజనం, కలశ ప్రతిష్టా కార్యక్రమాల్లో అయ్యన్నపాత్రుడు దంపతులు శాస్త్రోక్తంగా పాల్గొన్నారు.అనంతరం అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ పూజా కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కి, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ దంపతులు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర దంపతులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను తదితరులు తమ సతీమణులతో కలిసి పాల్గొన్నారు.వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో మార్మోగింది. కోలాటాలు, శక్తి వేషధారణలు, భరతనాట్య ప్రదర్శనలు, కేరళ డప్పు వాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భారీగా తరలివచ్చిన భక్తులతో అనకాపల్లి పురవీధులు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు దీర్ఘ క్యూలైన్లలో వేచి ఉండి దర్శనం చేసుకున్నారు.