గంజాయి రవాణాదారులకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష చోడవరం కోర్టు సంచలన తీర్పు – ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా
🗞️ బిబి న్యూస్ | 09 Mar 2026
అనకాపల్లి, మార్చి 9: అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోందని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.చోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన గంజాయి రవాణా కేసులో ఇద్దరు నిందితులకు చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.ఈ కేసును విచారించిన 9వ అదనపు జిల్లా జడ్జి ఎం. హరినారాయణ నిందితులైన వంతల జయరాం (A1), గొల్లూరి భీమరాజు (A2) పై మోపబడిన ఆరోపణలు నిరూపితమయ్యాయని తేల్చి, ఇద్దరికీ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1,00,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.గత 2016 సెప్టెంబర్ 2న గౌరపట్నం గ్రామ సమీపంలో 148 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న సమయంలో అప్పటి చోడవరం ఎస్సై పి. నరసింహమూర్తి మరియు పోలీస్ సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసులో పక్కా ఆధారాలతో చార్జ్ షీట్ దాఖలు చేయడంలో ఎస్సై మరియు వారి బృందం కీలక పాత్ర పోషించారు.ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్టులు, ఇతర కీలక సాక్ష్యాలను కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడేలా వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురుపల్లి సూర్యనారాయణ, కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బంది, చోడవరం పోలీసులను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు.మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని, యువత భవిష్యత్తుతో ఆడుకునే గంజాయి స్మగ్లర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఎస్పీ హెచ్చరించారు.