ఈనెల 17 నుంచి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు
🗞️ బిబి న్యూస్ | 10 Mar 2026
అనకాపల్లి, మార్చి 11:
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను తెలిపారు.మంగళవారం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17న మంగళవారం రాత్రి జాతర ప్రారంభమవుతుందని, 18న బుధవారం కొత్త అమావాస్య పండుగ, 19న గురువారం ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ జాతరను స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
మూడేళ్ల తర్వాత అమ్మవారి నూతన ఆలయ పునఃప్రారంభం, కలశ ప్రతిష్ట, రాజగోపురం ప్రతిష్టాపన కార్యక్రమాలు ఇటీవల ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ నూతన నిర్మాణానికి సుమారు రూ.11 కోట్ల 98 లక్షలు ఖర్చు అయినట్లు చెప్పారు.భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు, ఇతర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనకాపల్లి జిల్లా సహాయ కమిషనర్ సుధారాణి మాట్లాడుతూ, ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే కొత్త అమావాస్య జాతర మహోత్సవాలను భక్తులందరూ విజయవంతం చేయాలని కోరారు. ఆలయాన్ని రంగులతో అలంకరించి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ శ్రీధర్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.