📢 Advertisement Space

పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా

🗞️ బిబి న్యూస్ | 13 Mar 2026

అనకాపల్లి: రైతుల సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతులకు గొప్ప ఆర్థిక భరోసాగా నిలుస్తోందని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్,అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లోకి రూ.6,000 నేరుగా జమ చేస్తూ రైతు కుటుంబాలకు ఆర్థిక మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు.అనకాపల్లి జిల్లాలో కూడా ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 2,42,536 మంది రైతులకు రూ.134.27 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వెల్లడించారు. ఇందులో అన్నదాత సుభిక్ష పథకం కింద రూ.97.01 కోట్లు, పీఎం కిసాన్ పథకం కింద రూ.37.26 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయని చెప్పారు.రైతుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి పనిచేస్తున్నాయని, రైతు సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారికి ఆర్థికంగా బలం చేకూరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలిపారు.