అనకాపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య పండుగ సందర్భంగా మాలధారణ చేసిన భక్తులతో కలిసి అమ్మవారి ఘటాల భారీ ఊరేగింపు కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమాన్ని భక్తుడు పోలిమేర శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ ఘటాల ఊరేగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీడీపీ ఇంచార్జ్, ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, జనసేన పార్టీ ఇంచార్జ్ రాంకీ, ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పీలా నాగ శ్రీను, ఆలయ ఈఓ శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘటాల ఊరేగింపుతో అనకాపల్లి పట్టణం భక్తి భావంతో మార్మోగింది.