📢 Advertisement Space

పదవ తరగతి పరీక్షలకు అనకాపల్లి జిల్లాలో కట్టుదిట్టమైన బందోబస్తు

🗞️ బిబి న్యూస్ | 14 Mar 2026

అనకాపల్లి జిల్లాలో నిర్వహించనున్న పదవ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ తెలిపారు.మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
జిల్లాలో మొత్తం 102 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 21,017 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,673 మంది బాలురు, 10,344 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 9:00 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభమైన తరువాత పరీక్ష పూర్తయ్యే వరకు విద్యార్థులను బయటకు అనుమతించరని తెలిపారు.హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. అలాగే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్ పరికరాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను కేంద్రంలోకి తీసుకురావడం పూర్తిగా నిషిద్ధమని చెప్పారు.పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని, కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుమికూడరాదని తెలిపారు. పరీక్షా సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ మరియు ఇంటర్నెట్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా మరెవ్వరూ, సిబ్బందితో సహా, పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టం చేశారు.సమస్యాత్మక మరియు సున్నితమైన పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే వారిపై “ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్, 1997” ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బ్యాగులు మరియు వ్యక్తిగత వస్తువుల భద్రతను స్వయంగా చూసుకోవాలని సూచించారు.