అనకాపల్లిలో జాతీయ లోక్ అదాలత్ – 1,697 కేసుల పరిష్కారం
🗞️ బిబి న్యూస్ | 15 Mar 2026
అనకాపల్లి, మార్చి 15:రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం రెండూ ఆదా అవుతాయని 10వ అదనపు జిల్లా జడ్జి వి. నరేష్ అన్నారు. అనకాపల్లి కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం ఏడు బెంచీలు ఏర్పాటు చేసి వివిధ రకాల కేసులను విచారించారు. ఈ లోక్ అదాలత్ ద్వారా మొత్తం 1,697 కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడ్డాయి.
కార్యక్రమానికి ముందు కక్షిదారులతో సమావేశం నిర్వహించిన న్యాయమూర్తి వి. నరేష్ మాట్లాడుతూ, కోర్టుల్లో సంవత్సరాల పాటు కొనసాగే వివాదాలను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుంకర శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బంధం వెంకటరమణ పాల్గొన్నారు. అలాగే న్యాయమూర్తులు పి. నాగేశ్వరరావు, జి. రామకృష్ణ, ధర్మారావు, రమేశ్, విజయలక్ష్మి, నికితా సెంగర్ తదితరులు హాజరయ్యారు.లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించడానికి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సహకారం అందించారు.