ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు
🗞️ బిబి న్యూస్ | 21 Mar 2026
అనకాపల్లి (నక్కపల్లి), మార్చి 21: నక్కపల్లి మండలం చందనాడ రెవెన్యూ పరిధిలో తమ్మయ్యపేట వద్ద ఈ నెల 23న (సోమవారం) జరగనున్న ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ (AM/NS) ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు హెచ్.డి. కుమారస్వామి,కింజరపు రామ్మోహన్ నాయుడు, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హోం మంత్రి వంగలపూడి అనిత మరియు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ IAS, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా IPSతో పాటు ఉన్నతాధికారులు శనివారం క్షేత్రస్థాయిలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) సమావేశం నిర్వహించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు కాన్వాయ్ రూట్‌ను అధికారులు నిశితంగా పరిశీలించారు.ప్రతి శాఖకు కేటాయించిన విధులు లోటు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించగా,హెలిప్యాడ్, సభా ప్రాంగణంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాన్యుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు.జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులతో మాట్లాడుతూ ఈ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలకమని, కేంద్ర-రాష్ట్ర మంత్రులకు, అతిథులకు ఇబ్బంది లేకుండా భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
నిబంధనల ప్రకారం భద్రతలో రాజీ పడకూడదని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటన విజయవంతం చేయాలని ఎస్పీ కోరారు.
పాల్గొన్నవారు.ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, అడిషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.ఎస్.వి. కృష్ణారావు, ఎస్.ఎస్.ఓ ఆర్.పి.ఎల్.శాంతి కుమార్, అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు, ఆర్డీఓ వీవీ రమణ, ఎస్.బి డీఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు మరియు ఇతర డీఎస్పీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.