వేసవి సెలవుల్లో పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి
🗞️ బిబి న్యూస్ | 07 Apr 2026
అనకాపల్లి, ఏప్రిల్ 07: వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో, పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు పరీక్షలు ముగించుకుని సెలవుల్లో సరదాగా గడిపే సమయంలో ఏ విధమైన ప్రమాదం కూడా ఉండకూడదన్నదే మా ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.సెలవుల్లో పిల్లలు సరదా కోసం ఇంటి సమీపంలోని చెరువులు, బావులు, కాలువలు, నీటి కుంటలు, సముద్ర తీరం వైపు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఎస్పీ గారు గుర్తించారు. నీటి లోతు, ప్రవాహ వేగం తెలియక ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందందున పిల్లలను ఈతకు ఒంటరిగా పంపకూడదని సూచించారు.పిల్లలు ఇంటి వద్ద ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో పిల్లలను బయటకు పంపకుండా ఇంటిలోనే ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.పిల్లలకు నీటి ప్రమాదాల వల్ల కలిగే నష్టాలు, గతంలో జరిగిన విషాద సంఘటనల గురించి వివరించి వారిలో అవగాహన పెంచాలని సూచిస్తూ, సరదా ప్రాణాంతకంగా మారకుండా చూడాలని కోరారు.సెలవుల్లో పిల్లల సమయాన్ని ఉపయోగకరంగా, సురక్షితంగా గడపాలంటే ఆటపాటలు, కథల పుస్తకాలు చదవడం, శాస్త్రీయ ప్రయోగాలు, కళా–క్రీడా కార్యక్రమాలు, వేసవి శిక్షణ శిబిరాల వైపు వారిని మళ్లించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల పిల్లలు నీటి ప్రమాదాల వల్ల కాకుండా, సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమయ్యే అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు.జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే వారు అలల ఉధృతిని, హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా గమనించాలని ఎస్పీ గారు సూచించారు. హెచ్చరిక బోర్డులు, రెడ్ ఫ్లాగ్ ఉన్న ప్రదేశాల్లో నీటిలోకి దిగడం అత్యంత ప్రమాదకరమని, అందులో ప్రాణాంతక ముప్పు ఉందని హెచ్చరించారు.ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం సంభవిస్తే వెంటనే డయిల్ 100 లేదా 112 కాల్ చేయాలని, లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.పిల్లల భవిష్యత్తు, వారి భద్రత తల్లిదండ్రుల ప్రత్యక్ష బాధ్యత అని గుర్తు చేస్తూ, ఏ ఒక్క కుటుంబంలోనూ వేసవి సెలవుల్లో విషాదం చోటుచేసుకోకూడదన్నదే మా ఉద్దేశ్యమని తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని, ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.