📢 Advertisement Space

వరాహ లక్ష్మీ నరసింహ దేవాలయం ఉచిత వివాహ వేదికపై సారధులకు విజ్ఞప్తి

🗞️ బిబి న్యూస్ | 10 Apr 2026

అనకాపల్లి, ఏప్రిల్ 10:
ప్రాంతీయంగా సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన వరాహ లక్ష్మీ నరసింహ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వివాహ వేదిక కార్యక్రమం సమాజానికి ఎంతో ఉపయోగకరంగా కొనసాగుతోందని విశ్రాంతి అధ్యాపకులు కాండ్రేగుల సర్వేశ్వరరావు అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన సారధులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రస్తుతం వివాహ సంబంధాల కోసం అబ్బాయిలు, అమ్మాయిలు ఫోటోలు మరియు బయోడేటా అందించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. అయితే ఇటీవల కొంతమంది కేవలం ఫోటోలు మాత్రమే పంపిస్తూ, అవసరమైన వివరాలు ఇవ్వకపోవడం గమనార్హమని తెలిపారు. ఇలా వివరాలు లేకుండా ఫోటోలు పంపడం వల్ల అపార్థాలకు అవకాశం ఉంటుందని, కనీసం విద్య, వృత్తి, కుటుంబ నేపథ్యం వంటి ప్రాథమిక సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.
అదేవిధంగా, మిడిల్ క్లాస్ వర్గాలకు ప్రత్యేకంగా గ్రూప్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. చిన్న ఉద్యోగాలు, స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ప్రస్తుతం సరైన గుర్తింపు పొందడం లేదని, వారికి ప్రత్యేక వేదిక కల్పిస్తే మంచి వివాహ అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.
సమాజ సేవలో భాగంగా గతంలో తాను చేసిన కృషిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 1990లో BC కమిషన్‌కు ప్రతిపాదనలు పంపడం, OBC అమలు ప్రక్రియలో పాల్గొనడం, క్రీమీ లేయర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యల ద్వారా అనేక మంది విద్యార్థులు IIT, మెడిసిన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో OBC కోటా ద్వారా లబ్ధి పొందినట్లు తెలిపారు.
ప్రతి ఆదివారం జరిగే సమావేశాల్లో పాల్గొని సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నానని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మరియు పెద్దల మార్గదర్శకత్వం ఈ కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు.
దిబ్బవీధిలో నిర్వహించే ఈ సేవా కార్యక్రమం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, నిర్వాహకులకు తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.