📢 Advertisement Space

శ్రీ నూకాంబిక జాతరలో స్వరాల జల్లు.. భక్తులను మంత్రముగ్ధులను చేసిన సినీ గాయని గాయకులు

🗞️ బిబి న్యూస్ | 12 Apr 2026

అనకాపల్లి జిల్లా:ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన నూకాంబిక అమ్మవారి రాష్ట్ర స్థాయి జాతర మహోత్సవాలు అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ మైదానంలో అద్భుతంగా కొనసాగుతున్నాయి.శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఇంచార్జ్ రాంకీ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలు 27వ రోజుకు చేరుకొని భక్తి, సంస్కృతి రంగులతో కళకళలాడుతున్నాయి.ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ గాయని గాయకులు గీత మాధురి, శ్రీకృష్ణల స్వరాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమ మధుర గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ గాయకులు, వేదికను భక్తి రసంతో నింపేశారు. ఈ నెల రోజులు జాతరలో భాగంగా ప్రముఖ వైద్యుడు, ప్రొఫెసర్ డాక్టర్ గొట్టు ముక్కల అచ్యుత రామ రాజుకు శాసనసభ్యుల చేతుల మీదుగా జాతర పురస్కారం అందజేసి సత్కరించారు. అలాగే గాయని గాయకులు గీత మాధురి, శ్రీకృష్ణలను కూడా శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
అనంతరం శ్రీరాముని భక్తి గీతాలతో ఎన్టీఆర్ మైదానం మారుమోగగా, అనకాపల్లి పట్టణమంతా పండగ వాతావరణంలో మునిగిపోయింది. ఈ స్వరాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించేందుకు అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి గానామృతంలో తేలియాడారు. మొత్తంగా, నూకాంబిక అమ్మవారి జాతరలో జరిగిన ఈ స్వరాభిషేకం కార్యక్రమం భక్తి, సంగీతం కలయికగా నిలిచి అందరి మనసులను గెలుచుకుంది.