కొక్కిరాపల్లి గురుకుల బాలికల పాఠశాలలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు
🗞️ బిబి న్యూస్ | 14 Apr 2026
అనకాపల్లి, ఏప్రిల్ 14: అనకాపల్లి జిల్లా ఎల్లమంచిలి నియోజకవర్గం కొక్కిరాపల్లి గ్రామంలోని గురుకుల బాలికల పాఠశాలలో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్యక్ష్యంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి , మాడుగుల శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి , యల్లమంచిలి శాసన సభ్యులు సుందరపు విజయకుమార్ , ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర , ఏపీ రోడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగఢ నాగేశ్వరావు , జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ తదితర అధికారులు పాల్గొని డా. బాబాసాహెబ్ అంబేద్కర్‌కు జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గురుకుల బాలికలు సిద్ధం చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ జీవిత సిద్ధాంతాలు, సామాజిక సంస్కరణ పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం పై వక్తలు వివరించారు. ఈ సందర్భంగా ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతి, అట్టడుగు వర్గాలకు సమానత్వం సాధించడం, స్వేచ్ఛ–సమానత్వాలను అందించే విధంగా డా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం సదా ఆచరణీయంగా ఉండాలని అన్నారు. డా. బీ.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆచరిస్తుందని, నేటి యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం అధికారులు, నాయకులు గురుకుల బాలికలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ సందేశాలు, సమాజ సంస్కరణ భావనలు విద్యార్థినుల మనసుల్లో ఘనంగా నాటుకున్నాయి.